Showing posts with label care. Show all posts
Showing posts with label care. Show all posts

Monday, February 14, 2011

అమ్మ 'చేతి దిండ్లు'

సిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్.
అవును. . . అవసరం కొత్త ఆలోచనలకు బీజం వేస్తుంది.
అదికూడా మరొకరు తీర్చలేని అవసరమయితే బుర్ర ఇంకా షార్ప్‌గా పనిచేస్తుంది.
అచ్చం ఇలానే జరిగింది ఎమిలీ జాక్సన్ జీవితంలో. గర్భంతో ఉన్న ఎమిలీ నెలలు నిండకముందే అంటే మూడు నెలల ముందే ప్రసవించింది. ప్రిమెచ్యూర్ డెలివరి. ఉండాల్సిన దానికంటే రెండు పౌండ్ల తక్కువ బరువుతో పుట్టాడు బాబు. ప్రతిరోజూ ఇన్‌క్యుబేటర్‌లో బాబు ఒక్కడినే పడుకోపెట్టడం ఆ తల్లి మనసును ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి గురిచేసింది. మనసు ఒకచోట నిలవలేదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచించింది. తల్లి మనసుకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అంతే వెంటనే మనిషి చేతుల్లా ఉండే దిండులాంటి వస్తువును తయారుచేసింది.

"నా బిడ్డలో ఒంటరిగా ఉన్నాననే భావన కలగకూడదు. అందుకే అమ్మ చేతి వెచ్చదనాన్ని కలిగించేందుకు నేను తయారుచేసిన దిండులాంటి ఆ వస్తువు బాబుకు ఎలా ఉపయోగపడుతుందోనని మానిటర్లో చూసుకునేదాన్ని. తల్లి తన దగ్గరే ఉందన్న భావనతో స్థిమితంగా పడుకున్న వాడ్ని చూసిన తరువాత నా ఆందోళన తగ్గిపోయింది'' అని చెప్పింది 43 యేళ్ల ఎమిలీ జాక్సన్.

ఇంతటితో ఈ కథకు ఫుల్‌స్టాప్ పడలేదు. సరిగ్గా పదేళ్ల తరువాత, అంటే బాబుకు తొమ్మిదేళ్లు వచ్చిన తరువాత కొడుకు జచరీ పేరుతో జాకీ బ్రాండ్ పిల్లోస్ తయారీ మొదలుపెట్టింది. ఈ బ్రాండ్‌కి అమెరికాలోను, మరికొన్ని దేశాలలోను దాదాపు 300 ఆసుపత్రుల్లో డిమాండ్ ఉంది. దాంతో ఈ ఏడాది పదిహేడు వేల మదర్ హ్యాండ్ పిల్లోస్ ఉత్పత్తి చేయాలనుకుంటోంది ఎమిలీ. జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతీ ఏడాది పన్నెండు శాతం ప్రిమెచ్యూర్ ప్రసవాలు జరుగుతాయి.

బిజినెస్‌గా ఎలా మారింది?

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి ఐదు నెలల తరువాత పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్లింది ఎమిలీ. ఆ తరువాత కొన్నాళ్లకు ఎమిలీకి హెర్మన్ ఆసుపత్రి నర్సుల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యింది. ప్రిమెచ్యూర్ బేబీల కోసం మరికొన్ని దిండ్లు తయారుచేయమని అడగసాగారు. తన తల్లి సాయంతో ఇంట్లో ఉన్న మెటీరియల్‌తో మొదట వంద దిండ్లను చేతితోనే తయారుచేసింది ఎమిలీ. ఆ తరువాత కొన్ని మార్పులు చేసింది. సైజ్, బరువు, ఉష్ణోగ్రతలు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ తయారుచేయడం మొదలుపెట్టింది. అలా మూడేళ్ల పాటు వాటి మీద పరిశోధనలు చేసింది. ఆ తరువాతి నుంచి పిల్లల అవసరాలకు తగ్గట్టు పిల్లోలు రూపొందించడం మొదలుపెట్టింది. ఎమిలీకి 21 యేళ్ల వయసులో కొలంబియా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడింది. వృత్తిరీత్యా ఈమె ఇండస్ట్రియల్ ఇంజినీర్.

ఇప్పుడు జాకీ పిల్లోస్ ఎడమ చెయ్యి, కుడి చెయ్యి రెండు మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. పిల్లలకి పూర్తిగా తల్లి పక్కనే ఉన్న భావన కలిగించేందుకు రెండు పిల్లోలనూ వాడుతున్నారు. మోచేతి పొడవుతో, 48 సెంటీమీటర్లు వెడల్పుతో ఉంటున్నాయి. యాంటీమైక్రోబయల్‌గా, ఉతుక్కునేందుకు వీలైన మెటీరియల్స్‌తో తయారుచేస్తున్నారు. జాకీ పిల్లోస్ పేరును ఈ మధ్యనే జాకీజ్‌గా మార్చారు. వీటి ధర 49.95 డాలర్లు.